![]() |
(డిసెంబర్ 26 మహానటి సావిత్రి వర్థంతి సందర్భంగా..)
పాతతరం కథానాయికల్లో మహానటి సావిత్రి తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ మహానటిగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు సావిత్రి. సౌమ్యురాలిగా, దానశీలిగా, ప్రేమమూర్తిగా పేరు తెచ్చుకున్న ఆమె జీవితంలో ఎన్నో వెలుగు నీడలు ఉన్నాయి. తన మంచితనంతో ఎంత పేరు తెచ్చుకున్నారో, కొన్ని సందర్భాల్లో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
పాతాళభైరవి చిత్రంలో తొలిసారి ఒక డాన్సర్‌గా కనిపించిన సావిత్రి.. ఆ తర్వాత పెళ్లిచేసి చూడు, పల్లెటూరుతోపాటు కొన్ని తమిళ సినిమాల్లో మంచి పాత్రలు పోషించి నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చేసిన దేవదాసు చిత్రం ఆమె కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తరుణంలోనే పారితోషికానికి సంబంధించి ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై ఒక పత్రికలో 'నిర్మాతలకు హెచ్చరిక' పేరుతో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. దాని సారాంశం ఇది.
నిన్న మొన్నటి వరకు సినిమాకు 300 తీసుకొని నటించిన సావిత్రి ఇప్పుడు ఏకంగా ఒక సినిమాకు 20,000 రూపాయలు డిమాండ్ చేస్తోందని, ఇది నిర్మాతల శ్రేయస్సుకు భంగం కలిగించే అవకాశం ఉందని ఆ ఆర్టికల్‌లో ప్రస్తావించారు. అప్పటివరకు సావిత్రి నటించిన ఒక్క సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదని, అలాంటప్పుడు ఆమె అడిగినంత పారితోషికం ముట్టచెప్పి అనవసరంగా ఆమె వేల్యూని పెంచేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
పత్రికలో ఈ ఆర్టికల్ వచ్చేనాటికి చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత బాగాలేదు. మంచి కథని ఎంపిక చేసుకొని సినిమా విజయం సాధించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫలితం ఉండేది కాదు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగింది. ఆరోజుల్లో పెద్ద నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న ఎవిఎం, జెమిని వంటి సంస్థలకు ఉద్యోగులను తగ్గించే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు చిత్ర పరిశ్రమ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
చిత్ర నిర్మాణ వ్యయం పెరిగిపోవడానికి ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు కూడా ఒక కారణమనే అభిప్రాయం ఆరోజుల్లోనే.. అంటే 60 ఏళ్ళ క్రితమే ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా సావిత్రిని టార్గెట్ చేశారు నిర్మాతలు. దాంతో ఆమెతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారంటూ పత్రికలు కథనాలు రాశాయి. సావిత్రి సినిమా రంగంలోకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, అవకాశాల కోసం ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగేవారో ఆమె పెదనాన్న చౌదరిగారు గుర్తు తెచ్చుకోవాలంటూ సూచించారు.
తారాపథంలో ఎదిగిన తర్వాత తాము ఇండిస్టీలోకి ఎలా అడుగు పెట్టాము, దాని కోసం ఎన్ని మెట్లు ఎక్కి దిగాల్సి వచ్చింది అనే విషయాలను తారలు గుర్తు పెట్టుకోవాలి. అలా కాకుండా తాము ప్రస్తుతం ఉన్న స్థితి గురించి మాత్రమే ఆలోచించడం చిత్ర పరిశ్రమకు శ్రేయస్కరం కాదు. ఉన్నఫళంగా పారితోషికం పెంచేయడం అనేది ఎవ్వరికీ క్షేమదాయకం కాదు. చేసిన దానికి తగిన ప్రతిఫలం తీసుకుంటూ క్రమంగా ఎదగడం తారలకు ఎంతో అవసరం. అలా ముందుకెళితేనే నిర్మాతలు మరిన్ని సినిమాలు నిర్మించే అవకాశం ఉంటుంది అంటూ ఆ పత్రికలో వచ్చిన కథనం అప్పట్లో చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. అయితే ఇప్పటివరకు సావిత్రి తీసుకునే పారితోషికానికి సంబంధించి ఇలాంటి వివాదం ఒకటి ఉందని చాలా మందికి తెలియదు.
![]() |